హలో అత్తా!..
చెప్పరా చేతన్
మమ్మీ వాళ్ల సిల్వర్ జుబిలీ ఫంక్షన్ చెద్దామా?
సరే చేద్దాం. మమ్మీకి చెప్పావా మరి?
లేదు. చెప్తే వద్దు మనీ వేస్ట్ అంటుంది. డాడీ కూడా ఒప్పుకోడు. వాళ్లకు చెప్పకుండా చేద్దాం. ఇది నాది, అక్కది ఐడియా. నువ్వేమంటావ్?
సరే . ఇంటికి రా .. అన్నీ మాట్లాడదాం. అమ్మమ్మ , తాత కూడా ఉంటారు.
ఇలా ఒక వారం క్రింద మా ఆడపడుచు కొడుకు చేతన్ అడిగాడు. అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చి సంతోషపెట్టాలని ప్రయత్నించే వదినకు ఆమె పిల్లలే ఇంత మంచి బహుమతి ఇస్తా అంటే ఎవరు మాత్రం కాదంటారు. పిల్లలకు ఇంత కాలం అన్నీ మమ్మీ చేసిపెట్టేది. ఈ పార్టీకి ఏమేం కావాలి, ఎలా చేయాలి అని తెలీదుకదా. అందుకే అత్తయ్య ,మామయ్య, మావారు కలిసి ఆలోచించి ఎలాచేయాలో డిసైడ్ చేసారు. అత్తయ్య చేతన్ తో వెళ్లి వంటకు కావలసిన సామాన్లు, అన్ని కొనిచ్చింది. ఏదైనా క్లబ్ లోచేద్దామంటే కూడా వద్దు ఇంట్లోనే చేద్దాం అంటే వంట మనిషిని మాట్లాడాము. ఇదంటా ఇంట్లో చెప్పొద్దు అంటే మమ్మీకితెలీకుండా పని కాదు. చెప్పమంటే ముందు రోజు సాయంత్రం వాళ్ల మమ్మీకి చెప్పాడు. సరే అంది. డాడీకి మాత్రం ఊరికే దగ్గరచుట్టాలకు భోజనాలు పెడుతున్నాం అని చెప్పారు పిల్లలు...
రెండు వైపులా దగ్గర చుట్టాలకు ఇదీ సంగతి అని చెప్పారు చేతన్ , దీప్తి. మమ్మీ, డాడీలకు అసలు సంగతి చెప్పొద్దు , సస్పెన్స్ అని కూడా చెప్తే అందరూ అంగీకరించారు. పొద్దున్నే వంటలు మొదలయ్యాయి. నేను , మా తోటికోడలు, అత్తయ్య కలిసి వంటల బాధ్యత తీసుకున్నాం, చేతన్ మావారితో వెళ్లి, పెద్ద కేక్, నిలువెత్తు పూలదండ, డెకొరేషన్సామాన్లు తీసుకొచ్చాడు. ఇందులో అసలు వ్యక్తులకు ఏమీ మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వలేదు. చెప్పినట్టు వినడమే వాళ్లపని. అరగంటలో పిల్లలంతా కలిసి హాల్ డెకొరేషన్ చేసారు. మొత్తం రెడీ అయ్యేవరకు అన్నయ్యకు తెలీదు. చూడగానేషాక్ అయ్యారు, ఇదేంటి అని.. అలాగే కూర్చోబెట్టి పిల్లలు అమ్మా నాన్నకు తాము తెచ్చిన కొత్త బట్టలు పెట్టి. అవివేసుకునేలోగా కేక్ , పూలదండలు అవి సర్ది పెట్టారు. అందరూ భలే ఆనందించారు. కేక్ అయ్యాక, నిలువెత్తు పూలడండవేసి పాదాభివందనం చేసారు దీప్తి, చైతన్య. అందరూ అక్షింతలు, పూలతో ఆశీర్వదించారు . తర్వాత భోజనాలు, ఆదివారం, హైదరాబాదు అంటే ముఘ్లాయీ స్పెషల్స్ కదా . బిర్యాని, సాస్ చికెన్, మిర్చి కా సాలన్, దాల్చ, కుర్బాని కామీటా, ఐస్ క్రీం, పాన్.... అందరూ సంతృప్తిగా భోజనాలు చేసి పిల్లలను దీవించి , మీ పెళ్లిల్లు చేసుకోండి. మళ్లీ మీ మమ్మీ, డాడీకి పెళ్లి చేయండి అప్పుదు ఇలాగే వస్తాము అంటూ ఒక్కరొక్కరు వీడ్కోలు పలికారు.
ఇది ఒక కుటుంబ వ్యవహారమే. కాని ఇక్కడ తల్లితండ్రులకు మరపురాని బహుమతి , ఆనందం ఇవ్వాలనితాపత్రయపడిన పిల్లల గురించి చెప్పాలనే నా చిన్ని ప్రయత్నం. పిల్లల కోసం ఆ తల్లితండ్రులు ఎంత కష్టపడ్డారో, ఆ పిల్లలుకూడా చిన్నప్పటినుండి ఎంత కష్టపడి చదువుకుని, మంచి ఉద్యోగాలలో సెటిల్ అయ్యారో నాకు తెలుసుగా. మీలో కూడాకొందరికి తెలుసనుకుంటా.. ఈ ఫంక్షన్ కి మీ ఫ్రెండ్స్ ని పిలువు అని వదినతో అంటే వద్దులే, ఫ్రెండ్స్ అని నమ్మితే నన్నుమోసం చేసారు కొందరు, మిగతావారు అంతా వెజిటేరియన్ వదిలేయ్ అంది. తర్వాత కూడా బ్లాగులో ఇవ్వలేదేంటి అంటేమూడ్ లేదు అంది. అవునూ ... ఇంతకీ మా వదిన ఎవరో అర్ధమైందా. మీ అందరికి ఆత్మీయురాలైన జ్యోతిగారే. ఇక్కడఎందరో ఆమెను అభిమానించేవారు, గౌరవించేవారు ఉన్నారని నాకు తెలుసు. ఈ విశేషాలను మీతో పంచుకోకపోతేఎలాగ మరి. అందుకే మా వదినకు తెలీకుండా, ఈ పోస్ట్ రాస్తున్నాను. సాయంత్రం మా పుట్టింటికి వెళుతున్నా. . ఇలాతనకు చెప్పకుండా టపా రాసి, ఫోటోలు పెట్టానని తెలిస్తే నా పని గోవిందా.. అందుకే వారం దాకా తనకు దొరకనుగా. ఉంటా మరి బై..
నా ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పిల్లలే పెద్దలైన వేళ....
Labels: నా ఆలోచనలు
అమ్మ
అమ్మ అంటే నాకు ఊహ తెలిసినంతవరకు 13 ఏళ్లవరకే అమ్మతో ఉన్నది. 14 ఏళ్లకే పెళ్లి చేసారు. బాల్య వివాహమని ఎవరికీ చెప్పకండే!!. ఏదో మంచి కుటుంబం. మళ్లీ దొరకదు అని మావాళ్లు తొందరపడి తొమ్మిదో క్లాసులొనే పెళ్లి చేసారు. నాకేం తెలుసు. ఎంచక్కా చదువుకునే బాధ తప్పుతుంది.మంచి మంచి చీరలు కట్టుకోవచ్చు. ఎన్నో నగలు వేసుకోవచ్చు కదా అని సంబరపడిపోయాను. పుట్టింట్లో లంకంత కుటుంబం. ఏడుగురు అన్నదమ్ముల కుటుంబాలు ఒకే ఇంట్లో . అందులో నాది ఇష్టారాజ్యం. ఇక నేను చేసే పనేముంటుంది. దబాయించి అడిగి మరీ తీసుకోవడం తప్పితే. పెళ్లయ్యాక పెద్ద కోడలిని. కాని ..చిన్న కుటుంబానికి..
కాని నాకు అత్తగారి రూపంలో మరో అమ్మ లభించింది. ఒక సంగతి చెప్తాను ..నవ్వొద్దు మరి.. పెళ్లయ్యాక నన్ను పదోక్లాసులో తనే నన్ను నిద్రలేపి, స్కూల్ డ్రెస్ ఇస్త్రీ చెసి , రెండు జడలేసి తయారుచేసి స్కూలుకు పంపేది .. రోజుకోరకం టిఫిన్ చేసిపెట్టేది. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ గుర్తు చేస్తారు. అప్పట్లో పెళ్లైనవాళ్లు తప్పనిసరి చీరలే కట్టాలి అనేవాళ్లు , కాని మా అత్తగారు డ్రెస్సులు కూడా కొనేవారు. అంతకు రెండేళ్ల ముందే మా ఆడపడుచు పెళ్లై వెళ్లిపోయింది. నన్నే కూతురిలా చూసుకునేవారు. మెల్లిగా ఒక్కో పని నేర్పించారు. అలాగే చీర కట్టుకోవడం. మీకు తెలుసా. మా అత్తగారు నాకు ఎన్నో డిజైన్లతో బ్లౌజులు కుట్టేవారు ...(ముసలమ్మలా సింపుల్ డిజైన్స్ ఎందుకు అని).. మా పిల్లలకు కూడా ఆమే అమ్మలా చూసుకునేవారు. స్కూలు టీచర్లతో మాట్లాడడం, వాళ్ల డ్రెస్సులు,పుస్తకాలు ఇలా అన్నీ.. అందుకే పిల్లలకు సంబంధించి నేను ఏ విషయం పట్టించుకోను అని మా వారు తిడుతుంటారు. అత్తయ్య ఉందిగా నాకెందుకు బెంగ అంటాను.
మా అత్తగారి మూలంగానే నేను ఎన్నో వంటలు నేర్చుకుంది. ఎప్పుడైనా ఏ పెళ్లిలో ఐనా, హోటల్ కి వెళ్లినా , కొత్త వంటకం కనిపిస్తే చాలు ఇద్దరం కలిసి దాన్ని పోస్ట్ మార్టం చేసి తింటూనే దాని పుట్తుపూర్వోత్తరాలు తెలుసుకుని మర్నాడు ఇంట్లో చేసేవాళ్లం .. ఇక దాని రుచి ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. ఆ వంటకాలు ఆంధ్రా ఐనా, చైనీస్ ఐనా, మొఘ్‌లాయి ఐనా సరే మా కంటబడితే ఇంట్లో ప్రత్యక్షమవ్వాల్సిందే. కొని తెచ్చుకోవచ్చు. హోటల్ వాడిచ్చే పరిమాణం సరిపొదు. నాజూగ్గా తినాలి. అందుకే ఇంట్లో చేసుకుంటే పోలా అని రంగంలో దూకేస్తాం. మా మావగారు ఇందులో మాకు తోడుంటారు.
మా అత్తగారు చాలా ధైర్యంకల మనిషి. తప్పు జరిగితే ఊరుకోదు. కడిగెస్తుంది. చుట్టూ ఎవరున్నదీ చూసుకోదు. ఎంత పెద్ద పనైనా భయపడేది లేదు.. చేసేయడమే.. నాకు ఆ అలవాటు రాలేదు మరి... మరోమంచి అలవాటు చెప్పనా.. తెలుగు తీవీ సీరియళ్లు కలిసి చూడడం, వాటి కథల గురించి చర్చించడం, ఫలానా సీరియల్ వచ్చే టైం వరకల్లా పనులన్నీ పూర్తిచేసుకోవడం. లేదా మగవాళ్లు లేకుంటె అవి పక్కన పెట్టేయడం మా దినచర్య.. కాని ఇప్పటికీ నన్ను ప్రోత్సహిస్తుంటారు.ఊరికే ఎందుకుంటావ్ ఏదో ఒక పని చేసుకో. నీకంటూ కొంచెమైనా ఆదాయం సంపాదించుకో. నీ ఖర్చులకు పనికొస్తాయి అని. నాకేమో బద్ధకం .. ఈ మంచి పని ఎప్పుడు చేస్తానో ఏమో.....
అందుకే అమ్మలాంటి ఈ అత్తమ్మ ప్రతి జన్మలో అత్తగారిలాగే రావాలి అని కోరుకుంటున్నాను. అమ్మలా ఐతే వదిలిపోవాలిగా. ..
Labels: నా ఆలోచనలు
