కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బ్లాగ్ వనభోజనాలు... ఉసిరి ఆవకాయ, బాదుషా

ముందుగా అందరికీ సారీ. ఆరోగ్యం బాలేక బ్లాగు రాయడంలేదు. పూర్తిగా కోలుకున్నాక రెగ్యులర్ గా రాస్తాను. అప్పటికీ మా వదిన తిడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆ టీవీ ముందు కూర్చుంటావు. నీ పెయింటింగ్స్ అవి పెట్టు, కొత్తవి నేర్చుకో అని. అయినా తనకేం తెలుసు ఈ సీరియళ్లు ఎంత ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. రోజూ చూడాల్సిందే కదా..:) సరే వనభోజనాలు ఉన్నాయి .నువ్వు చేసిన వంటకాలు పెట్టు అంటే ఇలా వచ్చా. అందరూ కూరలు , పులుసులు తెస్తారేమో అని కొద్దిగా స్వీటు, కొద్దిగా పచ్చడి తెచ్చాను.


కార్తీకమాసం లో ఉసిరికాయ తప్పకుండా తినాలంటారు కదా. అదే పచ్చడి ఎలా ఉంటుంది ...

సరే ఈ పచ్చడి కి కావలసిన కొలతలు రాసుకోండి. ఉసిరికాయలు - 1kg . నూనె -250 gms, పసుపు - 50 gms, కారం పొడి - 125 gms , అల్లం వెల్లుల్లి ముద్దా - 250 gms జీలకర్ర పొడి - 25 gms. మెంతి పొడి 10 gms.. ఆవపొడి 50 gms, నిమ్మ రసం - 1/4 cup.. ఇంగువ - చిటికెడు.

ముందు ఉసిరికాయలను కడిగి తుడిచి పెట్టుకోండి. తర్వాత నూనె వేడి చేసి వీటిని కాస్త రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. చల్లారాక చాకుతో గాట్లు పెట్టి లోపలి గింజను తీసేసి ఉసిరికాయను చిన్న ముక్కలుగా చేసుకోండి . లేదా అలాగే ఉన్నా పర్లేదు . చిన్న ముక్కలుగా ఉంటే వేస్ట్ కాకుండా ఉంటుందని . ఇందాక వేయించిన నూనె ఉందిగా అది మళ్లీ వేడి చేయండి. ఈ పచ్చడికి నువ్వులనూనె ఐతే బాగుంటుంది. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఇంగువ వేసి దింపేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం,వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా కలపాలి. పూర్తిగా చల్లారాక పసుపు, కారంపొడి, జీలకర్ర, మెంతిపొడి, ఆవపొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉసిరిముక్కలు వేసి కలిపి నిమ్మరసం కూడా కలిపి జాడీల్లో ఎత్తి పెట్టుకోండి. ఉసిరిముక్కలు నల్లబడకుండా నిమ్మరసం వేస్తామన్నమాట. అంతే రుచికరమైన ఉసిరి ఆవకాయ రెడీ..

మరి స్వీట్లు కూడా ఉండాలి కదా. ఇదిగోండి పురాతనమైన స్వీటు బాదుషా. ఇది చేయడం ఈజీనే. కాని అసలు ఈ స్వీట్ ను బాదుషా ఎందుకంటారో ? ఏమో? మీకు తెలుసా??

సరే ఇప్పుడు సరుకులు రాసుకోండి .. ,మైదా - 250 gms, డాల్డా లేదా వెన్న - 50 gms , పెరుగు - 200 gms, వంటసోడా -చిటికెడు, ఉప్పు -చిటికెడు , చక్కెర - 500 gms, ఇలాచి పొడి - 1/2 tsp, నూనె - వేయించడానికి..

మైదాలో ఉప్పు, సోడా వేసి జల్లించాలి. ఇందులో కరిగించిన డాల్డా లేదా వెన్న లేదా నెయ్యి వేసి కలపాలి. తర్వాత తగిన నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడిపి ఒక గంట నాననివ్వాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో ముద్దలా చేసుకుని కొద్దిగా వెడల్పు చేసి మధ్యలో వేలితో గుంతలా చేయాలి. ఇలా చేసుకున్నవి వేడి నూనెలో నిదానంగా బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. పక్కన చక్కెర లో అరకప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలా మరిగించి ఇలాచిపొడి కలపి మూతపెట్టి ఉంచాలి. వేయించిన బాదుషాలను ఈ పాకంలో వేసి పది నిమిషాలు నాననిచ్చి తీసి విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి.. బాదుషా తినడానికి రెడీ. వేడిగా ఐనా చల్లగా ఐనా తినొచ్చు.. వేడిగా ఉన్నప్పుడే ఒకటి లాగించండి. భలే ఉంటుంధి..

బ్లాగ్వనంలో వనభోజనాలు - ఒక వేపుడు, ఒక పకోడీలు




దొండకాయ వేపుడు అందరికి తెలిసిందే .అదే వేపుడును కాస్త వెరయిటీగా చేసుకుందామా..దొండకాయలను సన్నగా దారాల్లాగా కట్ చేసుకోవాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోని పక్కన పెట్టుకోండి. మరో ప్యాన్ లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు,ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక కాస్త ఎక్కువ శనగపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించండి. వేయించిన దొండకాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టకుండా ఐదునిమిషాలు వేయించండి. చివరలో కొత్తిమిర చల్లి వేడిగా వడ్డించండి. అన్నంలోకి బానే ఉంటుంది కాని రొట్టెలకు మాత్రం గిన్నెలోకూర మిగిలితే ఒట్టు.. రొట్టెలే మిగలొచ్చు..


వనభోజనాలు అంటే కూరలు,పప్పులు మాత్రమేనా కాస్త నంజుకోవడానికి పకోడీలు ఉంటే బాగుంటుంది అని ఇవి చేశాను. మామూలుగా ఉల్లి పకోడీ, పాలకూర పకోడీలు చేసుకుంటాము కదా. రెండుకలిపితే పోలా అని కలిపేసా. పాలకూర కడిగి ఆరనిచ్చి సన్నగా తరగాలి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి ,చేత్తో పొడి పొడిగా అయ్యేట్టు చిదుముకొవాలి. ఇందులో సెనగపిండి వేయండి. మరీ ఎక్కువ కాకుండా,మరీ తక్కువ కాకుండా. అలాగే మీకు కావలసినంత ఉప్పు, కారం, ధనియాలపొడి, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, చెంచాడు వాము , ఇష్టముంటే చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్దా వేసి మొత్తం బాగా కలపండి. ఉల్లిపాయల తడి సరిపోతుంది. వేరే నీళ్లు పోయనవసరం లేదు. బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండి చేత్తో పొడిపొడిగా వేయండి.ముద్దలుగా వేయొద్దు . రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పేపర్ పై వేయండి. కొద్ది సేపాగి సర్వ్ చేయండి.

నాకు తెలిసిన అభిరుచులు, ఆలోచనలు మీతో పంచుకోడానికి ఈ వేదిక....