అమ్మ



అమ్మ అంటే నాకు ఊహ తెలిసినంతవరకు 13 ఏళ్లవరకే అమ్మతో ఉన్నది. 14 ఏళ్లకే పెళ్లి చేసారు. బాల్య వివాహమని ఎవరికీ చెప్పకండే!!. ఏదో మంచి కుటుంబం. మళ్లీ దొరకదు అని మావాళ్లు తొందరపడి తొమ్మిదో క్లాసులొనే పెళ్లి చేసారు. నాకేం తెలుసు. ఎంచక్కా చదువుకునే బాధ తప్పుతుంది.మంచి మంచి చీరలు కట్టుకోవచ్చు. ఎన్నో నగలు వేసుకోవచ్చు కదా అని సంబరపడిపోయాను. పుట్టింట్లో లంకంత కుటుంబం. ఏడుగురు అన్నదమ్ముల కుటుంబాలు ఒకే ఇంట్లో . అందులో నాది ఇష్టారాజ్యం. ఇక నేను చేసే పనేముంటుంది. దబాయించి అడిగి మరీ తీసుకోవడం తప్పితే. పెళ్లయ్యాక పెద్ద కోడలిని. కాని ..చిన్న కుటుంబానికి..


కాని నాకు అత్తగారి రూపంలో మరో అమ్మ లభించింది. ఒక సంగతి చెప్తాను ..నవ్వొద్దు మరి.. పెళ్లయ్యాక నన్ను పదోక్లాసులో తనే నన్ను నిద్రలేపి, స్కూల్ డ్రెస్ ఇస్త్రీ చెసి , రెండు జడలేసి తయారుచేసి స్కూలుకు పంపేది .. రోజుకోరకం టిఫిన్ చేసిపెట్టేది. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ గుర్తు చేస్తారు. అప్పట్లో పెళ్లైనవాళ్లు తప్పనిసరి చీరలే కట్టాలి అనేవాళ్లు , కాని మా అత్తగారు డ్రెస్సులు కూడా కొనేవారు. అంతకు రెండేళ్ల ముందే మా ఆడపడుచు పెళ్లై వెళ్లిపోయింది. నన్నే కూతురిలా చూసుకునేవారు. మెల్లిగా ఒక్కో పని నేర్పించారు. అలాగే చీర కట్టుకోవడం. మీకు తెలుసా. మా అత్తగారు నాకు ఎన్నో డిజైన్లతో బ్లౌజులు కుట్టేవారు ...(ముసలమ్మలా సింపుల్ డిజైన్స్ ఎందుకు అని).. మా పిల్లలకు కూడా ఆమే అమ్మలా చూసుకునేవారు. స్కూలు టీచర్లతో మాట్లాడడం, వాళ్ల డ్రెస్సులు,పుస్తకాలు ఇలా అన్నీ.. అందుకే పిల్లలకు సంబంధించి నేను ఏ విషయం పట్టించుకోను అని మా వారు తిడుతుంటారు. అత్తయ్య ఉందిగా నాకెందుకు బెంగ అంటాను.



మా అత్తగారి మూలంగానే నేను ఎన్నో వంటలు నేర్చుకుంది. ఎప్పుడైనా ఏ పెళ్లిలో ఐనా, హోటల్ కి వెళ్లినా , కొత్త వంటకం కనిపిస్తే చాలు ఇద్దరం కలిసి దాన్ని పోస్ట్ మార్టం చేసి తింటూనే దాని పుట్తుపూర్వోత్తరాలు తెలుసుకుని మర్నాడు ఇంట్లో చేసేవాళ్లం .. ఇక దాని రుచి ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. ఆ వంటకాలు ఆంధ్రా ఐనా, చైనీస్ ఐనా, మొఘ్‌లాయి ఐనా సరే మా కంటబడితే ఇంట్లో ప్రత్యక్షమవ్వాల్సిందే. కొని తెచ్చుకోవచ్చు. హోటల్ వాడిచ్చే పరిమాణం సరిపొదు. నాజూగ్గా తినాలి. అందుకే ఇంట్లో చేసుకుంటే పోలా అని రంగంలో దూకేస్తాం. మా మావగారు ఇందులో మాకు తోడుంటారు.


మా అత్తగారు చాలా ధైర్యంకల మనిషి. తప్పు జరిగితే ఊరుకోదు. కడిగెస్తుంది. చుట్టూ ఎవరున్నదీ చూసుకోదు. ఎంత పెద్ద పనైనా భయపడేది లేదు.. చేసేయడమే.. నాకు ఆ అలవాటు రాలేదు మరి... మరోమంచి అలవాటు చెప్పనా.. తెలుగు తీవీ సీరియళ్లు కలిసి చూడడం, వాటి కథల గురించి చర్చించడం, ఫలానా సీరియల్ వచ్చే టైం వరకల్లా పనులన్నీ పూర్తిచేసుకోవడం. లేదా మగవాళ్లు లేకుంటె అవి పక్కన పెట్టేయడం మా దినచర్య.. కాని ఇప్పటికీ నన్ను ప్రోత్సహిస్తుంటారు.ఊరికే ఎందుకుంటావ్ ఏదో ఒక పని చేసుకో. నీకంటూ కొంచెమైనా ఆదాయం సంపాదించుకో. నీ ఖర్చులకు పనికొస్తాయి అని. నాకేమో బద్ధకం .. ఈ మంచి పని ఎప్పుడు చేస్తానో ఏమో.....


అందుకే అమ్మలాంటి ఈ అత్తమ్మ ప్రతి జన్మలో అత్తగారిలాగే రావాలి అని కోరుకుంటున్నాను. అమ్మలా ఐతే వదిలిపోవాలిగా. ..

2 కామెంట్‌లు:

పరిమళం 10 మే, 2009 12:42 AMకి  

అందరం అమ్మ గురించి రాస్తే మీరు అమ్మ లాంటి అత్తమ్మ గురించి రాశారు .ఇందిరగారు మీకు , అమ్మకు మరియు అత్తమ్మకు ..mothers day శుభాకాంక్షలు .

మాలా కుమార్ 10 మే, 2009 6:31 AMకి  

మీకే కాదు అందరికీ మీ అత్తగారిలాటి అత్తగారు దొరకాలి.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

నాకు తెలిసిన అభిరుచులు, ఆలోచనలు మీతో పంచుకోడానికి ఈ వేదిక....