పానీపూరీ, పావ్ భాజీ, ఆలూ చాట్...
పేర్లు వింటుంటే పిల్లలకే కాదు, పెద్దలకూ నోట్లో నీళ్లు ఊరుతుంటాయి.
చాట్ బండి కళ్ల ముందు కనిపించితెగ కవ్విస్తూ ఉంటుంది. పెద్ద కుండలోని
పానీని ముంచి పూరీల్లో పెట్టి టకాటకా ఇచ్చేవారు ఇస్తుంటే తీసుకునేవారు
లెక్కలేకుండా గుటగుట లాగించేస్తుంటారు.
కొంచెం గరంగరంగా... ఇంకొంచె కారంకారంగా మసాలా నషాలానికంటుతున్నా చాట్ రుచిని ఆస్వాదిస్తూ చిట్‌చాట్‌లో మునిగిపోతారు.
బహుపసందైన ఆ రుచులను ఈ వారం ఇంట్లోనే తయారుచేయండి.
ఇంటిల్లిపాదీ ఆనందాలను చిట్ చాట్‌లో ముంచెత్తండి. కార్న్ మినీ పిజ్జా కావలసినవి: పిజ్జా బేస్ - 4
ఉడికించిన స్వీట్ కార్న్ - పావు కప్పు
బీన్స్, క్యారట్, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు - పావు కప్పు
టొమాటో సాస్ - 3 టేబుల్ స్పూన్లు
చీజ్ తురుము - పావు కప్పు
ఉప్పు - తగినంత
చిల్లీ ఫ్లేక్స్ - 2 టీ స్పూన్లు
ఉల్లికాడల తరుగు - 3 టీ స్పూన్లు
తయారి:
చిన్న సైజు పిజ్జా బేస్ తీసుకొని పలుచగా టొమాటో సాస్ పూయాలి. దాని పైన
సన్నగా తరిగిన క్యాప్సికమ్, ఉల్లికాడలు, క్యారట్, బీన్స్ ముక్కలు వేయాలి.
దానిపైన చీజ్ తురిమి వేసి ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి పది నిమిషాలు లేదా
చీజ్ కరిగేంతవరకు బేక్ చేయాలి. అవెన్ లేకుంటే నాన్ స్టిక్ లేదా మందపాటి
పాన్ వేడి చేసి అందులో ఈ పిజ్జాలు పెట్టి, పైన మూతపెట్టి పదినిమిషాలు
ఉంచాలి. చీజ్ కరిగిన తర్వాత తీయాలి.
చాక్లెట్ పానీ పూరీ కావలసినవి: పూరీలు - 10
ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ - టీ స్పూన్
పంచదార - 3 టీ స్పూన్లు
నీళ్లు - 2 కప్పులు; చాకోస్ - పావు కప్పు
జీడిపప్పు, బాదం - 10; చాక్లెట్ బార్ - 1
తయారి:
నీళ్లు మరిగించి, పంచదార, కాఫీ పొడి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన
తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. జీడిపప్పు, బాదం, మిల్క్ చాక్లెట్ బార్ చిన్న
ముక్కలుగా కట్ చేసి చాకోస్‌తో కలిపి పెట్టుకోవాలి. సర్వ్ చేసేముందు పూరీల
మధ్యలో డొల్ల చేసి చెంచాడు చాకోస్, చాక్లెట్ మిశ్రమం పెట్టి కోల్డ్ కాఫీతో
సర్వ్ చేయాలి. చాక్లెట్ ఇష్టపడేవారికి ఈ పానీపూరీ బాగా నచ్చుతుంది.
సాండ్‌విచ్ బ్రెడ్ దహీవడ కావలసినవి: బ్రెడ్ స్లైసులు - 4
పెరుగు - 2 కప్పులు; పంచదార - టీ స్పూన్
క్యారట్ తురుము - 3 టీ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా; కారం - టీ స్పూన్
చాట్ మసాలా - టీ స్పూన్
బూందీ - 3 టీ స్పూన్లు; సేవ్ - 3 టీ స్పూన్లు
జీలకర్ర పొడి- 2 టీ స్పూన్లు
స్వీట్ చట్నీ - 2 టీ స్పూన్లు
గ్రీన్ చట్నీ - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
తయారి: ఒక
కప్పు పెరుగును పల్చటి వస్త్రంలో కట్టి అరగంట వేలాడదీయాలి. అందులో నీరంతా
పోయి గట్టి పెరుగు మిగులుతుంది. అది ఒక గిన్నెలోకి తీసుకొని, దానికి తగినంత
ఉప్పు, కొద్దిగా జీలకర్రపొడి, క్యారట్ తురుము వేసి కలిపి ఫ్రిజ్‌లో
పెట్టాలి. మిగిలిన పెరుగును అరకప్పు నీళ్లు, పంచదార కలిపి చిలికి
పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచులను తీసేయాలి. ఒక బ్రెడ్ స్లైసు మీద
చెంచాడు పెరుగు, క్యారట్ మిశ్రమం పరిచి ఇంకో స్లైసుతో మూసేయాలి. కొద్దిగా
ఒత్తిపెట్టి ప్లేటులో పెట్టాలి. దీనిని రెండు లేదా నాలుగు ముక్కలుగా కూడా
కట్ చేసుకోవచ్చు. దానిపైన చిలికిన పెరుగు సమానంగా పోయాలి. దానిపైన ఖర్జూరం,
బెల్లం, జీలకర్రపొడి, చింతపండు పులుసులతో చేసిన స్వీట్ చట్నీ, పుదీనా,
కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసంతో చేసిన గ్రీన్ చట్నీ, కారం వేయాలి.
తర్వాత కొంచెం బూందీ, కొంచెం సేవ్, క్యారట్ తురుము, కొత్తిమీర వేసి సర్వ్
చేయాలి.
చైనీస్ పావ్ భాజీ కావలసినవి: ఉల్లిపాయ తరుగు - అర కప్పు
సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారట్, క్యాప్సికం, టొమాటో - అరకప్పు
అజినమోటో - చిటికెడు; ఉడికించిన కార్న్ గింజలు - పావు కప్పు
ఉడికించిన బంగాళదుంప - 1; ఉడికించిన నూడుల్స్ - అర కప్పు
ఎండుమిర్చి- 4; వెల్లుల్లి - 5; టొమాటో సాస్ - 2 టీ స్పూన్లు
మిరియాలపొడి - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత
ఉల్లి కాడలు - పావు కప్పు; వెన్న - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 2 టీ స్పూన్లు
తయారి: పాన్‌లో
నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, కూరగాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు
వేయించాలి. తర్వాత అజినమోటో వేసి కలిపి, ఎండుమిర్చి, వెల్లుల్లి కలిపి
నూరిన ముద్ద, టొమాటో సాస్, సోయా సాస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి
కలిపి కొద్దిసేపు ఉడికించాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప తురుము,
నూడుల్స్, వెన్న, సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసి మరో రెండు నిమిషాలు
ఉడికించి దింపేయాలి. పావ్ బన్నును రెండుగా కట్ చేసుకొని వెన్న రాసి రెండు
వైపులా కాల్చుకుని వేడి వేడి కూర/ భాజితో సర్వ్ చేయాలి. కావాలంటే కొంచెం
చీజ్ తరిమి వేయొచ్చు.
ఆలూ బాస్కెట్ చాట్ కావలసినవి: బాస్కెట్ కోసం: ఆలు/బంగాళదుంపలు - 3; కార్న్‌ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - తగినంత; స్టీల్ టీ స్ట్రెయినర్స్ - 2; నూనె - వేయించడానికి తగినంత
చాట్ కోసం: ఆలు/బంగాళదుంపలు (ఉడికించినవి) - 2; ఉల్లిపాయ - 1; కారం- టీ స్పూన్
కొత్తిమీర - 3 టీ స్పూన్లు; స్వీట్ ఖజూర్ చట్నీ - పావు కప్పు; గ్రీన్ చట్నీ - పావు కప్పు
పెరుగు - 2 కప్పులు; బూందీ - పావు కప్పు; పంచదార - టీ స్పూన్; చాట్ మసాలా పొడి - టీ స్పూన్
తయారి: బంగాళదుంప
పై తొక్క తీసి, కడిగి తురుముకొని కొద్దిగా ఉప్పు కలిపి పక్కన
పెట్టుకోవాలి. కొద్ది సేపటి తర్వాత నీరంతా గట్టిగా పిండేసి కార్న్ ఫ్లోర్
కలపాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. రెండు స్టీల్ టీ స్ట్రెయినర్స్ తీసుకొని
వేడి నూనెలో ముంచి తీసి ఒక స్ట్రెయినర్‌లో కార్న్‌ఫ్లోర్ కలిపిన బంగాళదుంప
తురుము పలుచగా పెట్టి మరో స్ట్రెయినర్‌తో గట్టిగా వత్తి పెట్టాలి. ఈ రెండూ
కలిపి వేడి నూనెలో ముంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి. తర్వాత
చాకుతో మెల్లిగా ఆ బాస్కెట్‌ను విడదీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందు
అన్ని బుట్టలూ చేసి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చాట్
వస్తువులతో నింపాలి. ఒక బౌల్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, కారం
పొడి, చాట్ మసాలా పొడి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, తగినంత ఉప్పు వేసి
బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తయారుచేసి పెట్టుకున్న బంగాళదుంప
బాస్కెట్‌లో నింపాలి. పెరుగులో తగినంత ఉప్పు, కాస్త పంచదార, చాట్ మసాలా
పొడి వేసి చిలికి బాస్కెట్‌పై పోయాలి. దానిపైన స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ,
బూందీ, సేవ్, కొత్తిమీర, క్యారట్ తురుము వేసి వెంటనే సర్వ్ చేయాలి. దీని
కోసం పెరుగులో పంచదార, ఉప్పు, చాట్ మసాలా కలిపి ఫ్రిజ్‌లో పెట్టి, చల్లగా
అయ్యాక వాడుకుంటే రుచిగా ఉంటుంది.
కర్టెసీ: ఇందిరా ప్రియదర్శిని
హిమయత్ నగర్, హైదరాబాద్ సేకరణ: సాక్షి ఫ్యామిలీ
ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి