ముందుగా అందరికీ సారీ. ఆరోగ్యం బాలేక బ్లాగు రాయడంలేదు. పూర్తిగా కోలుకున్నాక రెగ్యులర్ గా రాస్తాను. అప్పటికీ మా వదిన తిడుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆ టీవీ ముందు కూర్చుంటావు. నీ పెయింటింగ్స్ అవి పెట్టు, కొత్తవి నేర్చుకో అని. అయినా తనకేం తెలుసు ఈ సీరియళ్లు ఎంత ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. రోజూ చూడాల్సిందే కదా..:) సరే వనభోజనాలు ఉన్నాయి .నువ్వు చేసిన వంటకాలు పెట్టు అంటే ఇలా వచ్చా. అందరూ కూరలు , పులుసులు తెస్తారేమో అని కొద్దిగా స్వీటు, కొద్దిగా పచ్చడి తెచ్చాను.
కార్తీకమాసం లో ఉసిరికాయ తప్పకుండా తినాలంటారు కదా. అదే పచ్చడి ఎలా ఉంటుంది ...
సరే ఈ పచ్చడి కి కావలసిన కొలతలు రాసుకోండి. ఉసిరికాయలు - 1kg . నూనె -250 gms, పసుపు - 50 gms, కారం పొడి - 125 gms , అల్లం వెల్లుల్లి ముద్దా - 250 gms జీలకర్ర పొడి - 25 gms. మెంతి పొడి 10 gms.. ఆవపొడి 50 gms, నిమ్మ రసం - 1/4 cup.. ఇంగువ - చిటికెడు.
ముందు ఉసిరికాయలను కడిగి తుడిచి పెట్టుకోండి. తర్వాత నూనె వేడి చేసి వీటిని కాస్త రంగు మారేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. చల్లారాక చాకుతో గాట్లు పెట్టి లోపలి గింజను తీసేసి ఉసిరికాయను చిన్న ముక్కలుగా చేసుకోండి . లేదా అలాగే ఉన్నా పర్లేదు . చిన్న ముక్కలుగా ఉంటే వేస్ట్ కాకుండా ఉంటుందని . ఇందాక వేయించిన నూనె ఉందిగా అది మళ్లీ వేడి చేయండి. ఈ పచ్చడికి నువ్వులనూనె ఐతే బాగుంటుంది. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఇంగువ వేసి దింపేయాలి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం,వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేలా కలపాలి. పూర్తిగా చల్లారాక పసుపు, కారంపొడి, జీలకర్ర, మెంతిపొడి, ఆవపొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉసిరిముక్కలు వేసి కలిపి నిమ్మరసం కూడా కలిపి జాడీల్లో ఎత్తి పెట్టుకోండి. ఉసిరిముక్కలు నల్లబడకుండా నిమ్మరసం వేస్తామన్నమాట. అంతే రుచికరమైన ఉసిరి ఆవకాయ రెడీ..
మరి స్వీట్లు కూడా ఉండాలి కదా. ఇదిగోండి పురాతనమైన స్వీటు బాదుషా. ఇది చేయడం ఈజీనే. కాని అసలు ఈ స్వీట్ ను బాదుషా ఎందుకంటారో ? ఏమో? మీకు తెలుసా??
సరే ఇప్పుడు సరుకులు రాసుకోండి .. ,మైదా - 250 gms, డాల్డా లేదా వెన్న - 50 gms , పెరుగు - 200 gms, వంటసోడా -చిటికెడు, ఉప్పు -చిటికెడు , చక్కెర - 500 gms, ఇలాచి పొడి - 1/2 tsp, నూనె - వేయించడానికి..
మైదాలో ఉప్పు, సోడా వేసి జల్లించాలి. ఇందులో కరిగించిన డాల్డా లేదా వెన్న లేదా నెయ్యి వేసి కలపాలి. తర్వాత తగిన నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా తడిపి ఒక గంట నాననివ్వాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో ముద్దలా చేసుకుని కొద్దిగా వెడల్పు చేసి మధ్యలో వేలితో గుంతలా చేయాలి. ఇలా చేసుకున్నవి వేడి నూనెలో నిదానంగా బంగారురంగు వచ్చేవరకు వేయించాలి. పక్కన చక్కెర లో అరకప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలా మరిగించి ఇలాచిపొడి కలపి మూతపెట్టి ఉంచాలి. వేయించిన బాదుషాలను ఈ పాకంలో వేసి పది నిమిషాలు నాననిచ్చి తీసి విడిగా ప్లేట్లో పెట్టుకోవాలి.. బాదుషా తినడానికి రెడీ. వేడిగా ఐనా చల్లగా ఐనా తినొచ్చు.. వేడిగా ఉన్నప్పుడే ఒకటి లాగించండి. భలే ఉంటుంధి..
5 కామెంట్‌లు:
బాగుందండి ఉసిరికాయ పచ్చడి. బాదుషాలు కూడా. మరి బాదుషాలని ఎందుకంటారో మాత్రం తెలియదండి.
నాకూ చిన్నప్పుడు ఈ డౌటు వస్తూండేది - అక్బరు పాదుషాకీ, ఈ బాదుషాకీ సంబంధం ఏవిటా అని! స్వీట్లకి రాజు అనే ఉద్దేశంలో దీని సృష్టికర్త దీనికాపేరు పెట్టి ఉండొచ్చు.
ఉసిరిఆవకాయ నాకు మహా ఇష్టమైన పచ్చడి, మాగాయ కంటే కూడా. తినాల్సిన రోజుకి కనీసం ఓ వారం ముందే చేసుకొమ్మని సూచనకూడ పెట్టండి - లేక అదే రోజున తినెయ్యడానికి చూస్తే, ఉప్పూకారం ఇంకా కాయలోకి ఇంకవు కదా!
బాదుషా నాకిష్టమైన స్వీట్ . థాంక్ యు .
మీ ఆరోగ్యం త్వరగా కోలుకొని , మంచి మంచి పోస్ట్లు రాసేయండి మరి . బెస్ట్ ఆఫ్ లక్ .
ఆహా ఓ ఊరగాయ, ఓ కమ్మనైన స్వీటు బాగున్నాయండీ :-)
దాన్ని బాలూషా అంటారని ఆ మధ్య ఎక్కడో విన్నానండి. బాదుషా కాదుట, బాలూషా అనాలిట. మరి ఏది సరి అయిన పదమో నాకు తెలీదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి